YS Sharmila: సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం?: జగన్ పై మండిపడ్డ షర్మిల
- సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణ
- ఏపీకి ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని ఫైర్
- అధికారంలో ఉన్న ఐదేళ్లలో హోదా కోసం ఎన్నిసార్లు ధర్నా చేశారని నిలదీత
- సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో షర్మిల ప్రెస్ మీట్
ఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్నా చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోయారని మండిపడ్డారు. ఈమేరకు సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు.
‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? హంతకులతో ఇప్పటికీ భుజాలు రాసుకుంటూ తిరుగుతూ సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు. ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ధర్నా చేశారా? మరి ఇప్పుడు ఎందుకు ధర్నాలు? అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు, మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారు. వీటన్నిటిపై ఏనాడూ ధర్నా చేయలేదు కానీ మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదే 11 మంది, ఉన్న ఆ కొద్దిమందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొనరా? ప్రజావ్యతిరేక బిల్లులపై పాలకపక్షంతో కొట్లాడే అవసరం మీకు లేదనుకుంటున్నారా’ అంటూ జగన్ ను షర్మిల నిలదీశారు.
వినుకొండలో జరిగిన హత్యకు కారణం వ్యక్తిగత కక్షలేనని పోలీసులు కూడా తేల్చేశారని షర్మిల గుర్తుచేశారు. హతుడు, హంతకుడు ఇద్దరూ నిన్నమొన్నటి వరకు వైసీపీతోనే ఉన్నారని గుర్తుచేస్తూ.. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుందని నిలదీశారు. ఓవైపు రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా మంది జనం వరదల్లో చిక్కుకున్నారని, ఇల్లూ వాకిలీ నీట మునగడంతో దిక్కుతోచక రోదిస్తున్నారని షర్మిల చెప్పారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని అనిపించడం లేదా? అంటూ జగన్ ను ప్రశ్నించారు. 'కేవలం మీ పార్టీ వాళ్లు ఓటు వేస్తేనే మీరు గెలిచారా? ఐదేళ్లు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారంట.. సిగ్గుండాలి కదా' అంటూ జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.