Software- Autodriver: వీకెండ్స్‌లో ఆటో డ్రైవ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్ ఇంజనీర్.. సామాజిక సంబంధాల విలువను తెలియజేసే ఘటన ఇదీ!

A Bengaluru Microsoft engineer who moonlights as an auto rickshaw driver to combat his feelings of Loneliness
  • ఒంటరితనాన్ని అధిగమించేందుకు వారాంతాల్లో డ్రైవర్ అవతారం
  • గుర్తించి సోషల్ మీడియాలో షేర్ చేసిన మరో టెకీ
  • ఐటీ నిపుణుల్లో ఒంటరితనానికి నిదర్శనమంటున్న నెటిజన్లు
మనుషుల జీవితంలో సామాజిక సంబంధాలు, మాటామంతీ కనుక్కునే వ్యక్తులు ఉండడం ఎంత అవసరమో తెలిపే ఘటన ఒకటి బెంగళూరు మహానగరంలో వెలుగుచూసింది. ఒంటరితనాన్ని భరించలేక ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి వారాంతాల్లో ఆటో డ్రైవర్‌‌గా మారుతున్నాడు. ఒంటరి అనే భావం నుంచి బయటపడేందుకు వేరే ఆప్షన్ లేక ఆటో నడుపుతున్నానని అతడు చెబుతున్నాడు. సదరు సాఫ్ట్‌వేర్-ఆటోడ్రైవర్‌ స్టోరీని వెంకటేశ్ గుప్తా అనే మరో టెకీ షేర్ చేశాడు. ఆటోనడుపుతున్న సదరు టెకీ ధరించిన హుడి (స్వెటర్) వెనుక మైక్రోసాఫ్ట్ కంపెనీ లోగో ముద్రించి ఉండడాన్ని అతడు గుర్తుపట్టి వివరాలు తెలుసుకున్నాడు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా సదరు సాఫ్ట్‌వేర్-ఆటోడ్రైవర్ వివరాలను వెంకటేష్ గుప్తా వెల్లడించాడు. ‘‘ఒంటరితనాన్ని అధిగమించేందుకు వీకెండ్స్‌లో ‘నమ్మ యాత్రి’ (ఆటో సర్వీస్ యాప్) నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కలిశాను. అతను కోరమంగళలోని మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ పోస్టుపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. అతడి ఒంటరితనం పట్ల చాలామంది  సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

టెక్ పరిశ్రమ పురోగమిస్తుండడంతో టెక్ నిపుణులలో ఒంటరితనం పెరుగుతుందని, ఇది కంటికి కనిపించని సత్యం అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. అత్యంత అధునాతన సాంకేతికత కూడా కొన్నిసార్లు మానవ పరస్పర చర్యను భర్తీ చేయలేదని వ్యాఖ్యానించాడు.  మరో యూజర్ స్పందిస్తూ... అతడి మానసిక పరిస్థితి ఎలా ఉందో అతడికే తెలుసునని అన్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఇప్పుడు విశ్రాంతి కంటే మానవ సంబంధాలు ముఖ్యమని భావిస్తున్నారని, తాను పని చేసే ఆఫీస్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఒంటరితనాన్ని భరించలేక బార్‌లో గడుపుతుంటాడని పేర్కొన్నాడు.

కాగా ఆటోలు, టాక్సీలు నడపడం చాలా మంచిదని, కొత్త వ్యక్తులతో పరిచయాల కోసం డ్రైవింగ్ చేసేవారిని తాను విదేశాలలో చూశానని, వారు డబ్బు కోసం పనిచేయరని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కొత్త వ్యక్తులతో పరిచయాన్ని వారు ఇష్టపడతారని అన్నాడు. మరో వ్యక్తి స్పందిస్తూ.. ప్రపంచంలో ప్రతిదాన్నీ అనుసంధానించిన టెక్నాలజీ ప్రపంచాన్ని ఒంటరిగా మార్చిందని వ్యాఖ్యానించాడు.
Software- Autodriver
Bengaluru
IT Professionals
IT Jobs

More Telugu News