14 Hours Workday: ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలని నిర్ణయించింది మేం కాదు: కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్
- ఉద్యోగులకు 14 గంటల పని విధానం అమలు చేయాలనుకుంటున్న ఐటీ పరిశ్రమ
- అనుమతి కోరుతూ కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదన
- తీర్మానానికి వచ్చిన బిల్లు... ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
- పని గంటలు పెంచాలని ఐటీ కంపెనీల నుంచే ఒత్తిడి వస్తోందన్న మంత్రి సంతోష్ లాడ్
ఉద్యోగులకు 14 గంటల పని విధానాన్ని అమలు చేసేందుకు అనుమతించాలని బెంగళూరు ఐటీ పరిశ్రమ కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రతిపాదన కర్ణాటక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఐటీ పరిశ్రమ ప్రతిపాదనను ఆమోదించేందుకు కర్ణాటక ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. ఉద్యోగుల పనివేళలు పెంచాలన్నది ఐటీ పరిశ్రమ తీసుకున్న నిర్ణయం అని, ఆ నిర్ణయంతో రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు సంబంధం లేదని సంతోష్ లాడ్ స్పష్టం చేశారు. పని సమయాన్ని రోజుకు 14 గంటలకు పెంచాలని ఐటీ పరిశ్రమలే ఒత్తిడి తెస్తున్నాయని వెల్లడించారు.
దీనికి సంబంధించిన బిల్లు తీర్మానానికి వచ్చిందని, అయితే ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని మంత్రి తెలిపారు.
దీనిపై ఐటీ కంపెనీల యాజమాన్యాలు బహిరంగ చర్చ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను కోరుతున్నామని, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని మంత్రి సంతోష్ లాడ్ వివరించారు.