Kinjarapu Ram Mohan Naidu: ఇవన్నీ చేయించిన వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటున్నారు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఢిల్లీలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ను కలిసిన రామ్మోహన్, నిమ్మల రామానాయుడు
- అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు
- గత ఐదేళ్లు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని ఎద్దేవా
- చంద్రబాబు ఇంటిపై కూడా రాళ్లు వేశారని వివరణ
ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో నేడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ, బీజేపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను రామ్మోహన్ నాయుడు మీడియాకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను జలవనరుల శాఖ మంత్రికి తెలియజేశామని వెల్లడించారు. ఆయన చాలా సానుకూలంగా స్పందించారని, అన్ని అంశాలను నిర్దిష్ట కాలవ్యవధిలోపే పూర్తిచేస్తామని హామీ ఇచ్చారని వివరించారు.
"పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు ఎంత ముఖ్యమో, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కూడా అంతే ముఖ్యం కాబట్టి సీఆర్ పాటిల్ కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రం, కేంద్రానికి మధ్య వారధుల్లా సమన్వయం చేయడానికి చంద్రబాబు ఈ బాధ్యతను మాకు అప్పగించారు.
పోలవరం పట్ల మేం చిత్తశుద్ధితో ఉన్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన తుగ్లక్ పనుల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో దాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందన్న సంకేతాలు ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మేం రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వగలం.
ఏపీకి సంబంధించింది చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ పరిస్థితులను మేం సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలను తీసుకువస్తాం" అని రామ్మోహన్ నాయుడు వివరించారు.
జగన్ పదేళ్లుగా చేస్తున్నది ఇదే!
ఇక, ఈ నెల 24న వైసీపీ ఢిల్లీలో ధర్నా చేయనుండడం పట్ల మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బదులిచ్చారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని, ఎంతోమంది హత్యకు గురయ్యారని వెల్లడించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కానీ, సామాన్యులు కానీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే... వాళ్లపై అక్రమ కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేయడం అందరూ చూశారని అన్నారు. నాడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు పట్ల పలు సందర్భాల్లో కూడా ప్రాణహాని కలిగించేలా వ్యవహరించారని, టీడీపీ ఆఫీసుపై దాడులు చేశారని, చంద్రబాబు ఇంటిపై రాళ్ల దాడి చేశారని రామ్మోహన్ నాయుడు వివరించారు.
ఇవన్నీ చేయించిన వ్యక్తి, ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే ఏదో జరిగిపోతోంది... అల్లకల్లోలం సృష్టించాలి అనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇవాళ జగన్ కూడా ఓ ఎమ్మెల్యేగా ఉన్నారని, తనకు ఏదైనా సమస్య ఉంటే అసెంబ్లీకి వెళ్లి గళం వినిపించే అవకాశం ఉందని, మరి ఎందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలేదని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
"ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ధైర్యంగా మాట్లాడొచ్చు కదా. కేవలం అసెంబ్లీని ఎగ్గొట్టడానికే శాంతిభద్రతల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలి, రాస్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాలి అనే అజెండాతో పనిచేస్తుంటే, అది జరగకుండా చేస్తున్నారు.
ఏపీకి పెట్టుబడులు రావడం, అభివృద్ధి జరగడం, యువతకు ఉద్యోగాలు రావడం జగన్ కు ఇష్టం లేదు. అందుకే ఇలాంటి ఫేక్ డ్రామాలు ఆడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటున్నారు... మరి ఎన్ని హత్యలు జరిగాయో చెప్పమని అడుగుతున్నాం. ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయి, ఆయన ఎన్ని చోట్లకు వెళ్లారు? చెప్పమంటున్నాం. శవాల మీద రాజకీయాలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. గత పదేళ్లుగా అదే చేస్తున్నారు" అంటూ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు.