Chevireddy Mohjith Reddy: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం
- మే 14న పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద పులివర్తి నానిపై హత్యాయత్నం
- ఈ కేసులో మోహిత్‌రెడ్డిని తాజాగా 37వ నిందితుడిగా చేర్చిన పోలీసులు
- మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణ వాయిదా
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. మే 14న పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో మోహిత్‌రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నారు. నాని ఫిర్యాదు మేరకు అప్పటి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులైన భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఆ తర్వాతి రోజే 13 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఇదే కేసులో మరో 34 మందిని జైలుకు పంపారు.
అప్పట్లో ఎఫ్ఐఆర్లో మోహిత్‌రెడ్డి పేరు చేర్చని పోలీసులు ఇటీవల ఆయనను 37వ నిందితుడిగా పేర్కొన్నారు. తాజాగా, ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. దీంతో మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, బెయిల్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణను మాత్రం వాయిదా వేసింది. దీంతో ఆయన అరెస్ట్ తప్పకపోవచ్చని, ఏ క్షణమైనా మోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది.