Budget 2024: కేంద్ర బడ్జెట్: 500 పెద్ద కంపెనీలలో ఇంటర్న్ షిప్ అవకాశాల కల్పన
- పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం
- వంద నగరాల్లో పారిశ్రామిక పార్కులు
- ఇండస్ట్రియల్ ఏరియాల్లో కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. 500 పెద్ద కంపెనీలలో ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పిస్తామని, పారిశ్రామిక వాడల్లో కార్మికుల సౌకర్యం కోసం అద్దె గృహాలను నిర్మిస్తామని నిర్మల తెలిపారు. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.