Budget 2024: బడ్జెట్ లో వేతన జీవులకు స్వల్ప ఊరట
- కొత్త పన్ను విధానంలో పలు మార్పులు
- స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంపు
- రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు
- రూ.7 లక్షల వరకు 5 శాతం పన్ను
బడ్జెట్ లో వేతన జీవులకు స్వల్ప ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను రూ.75 వేలకు పెంచామన్నారు. అలాగే, కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను లేదని మంత్రి చెప్పారు. రూ.3 లక్షలు ఆపై ఆదాయం ఆర్జించే వారికి శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తామని వివరించారు. రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారి నుంచి 30 శాతం పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త విధానంలో వేతన జీవులు రూ.17,500 మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఇక పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
కొత్త పన్ను విధానం శ్లాబ్ లలో మార్పులు..
- రూ.3 లక్షల వరకు పన్ను ‘సున్నా’
- రూ.3-7 లక్షల వరకు 5 %
- రూ.7-10 లక్షల వరకు 10 %
- రూ.10-12 లక్షల వరకు 15 %
- రూ.12- 15 లక్షల వరకు 20 %
- రూ.15 లక్షల పైన 30 %