Union Budget-2024: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే...!
- అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల సాయం ప్రకటించిన కేంద్రం
- ఇంకా సాయం చేస్తామన్న నిర్మలా సీతారామన్
- ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారన్న రామ్మోహన్ నాయుడు
ఇవాళ ప్రకటించిన కేంద్ర బడ్జెట్-2024లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు సహాయసహకారాలు, ఇతర అభివృద్ధి పనులకు మద్దతు ప్రకటించడంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ సహృదయంతో అర్థం చేసుకున్నారని, అందుకే ఏపీకి అండగా నిలవాలని కేంద్రం నిశ్చయించిందని తెలిపారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రామ్మోహన్ నాయుడు వివరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.
జగన్ పాలనలో ఏపీ ఐదేళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఉందని, రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని విమర్శించారు.