Pawan Kalyan: చంద్రబాబుకు సుదీర్ఘ అనుభవం ఉంది... ఆయన నాయకత్వంలో కలిసి పనిచేస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో అమరావతి, పోలవరం ఆగిపోయాయని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అని, ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వంలో కలిసి పనిచేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ అవినీతికి దూరంగా ఉంటూ పనిచేయాలని, తప్పు చేస్తే జనసేన వారిపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ నేను తప్పు చేసినా నాపై చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా పవన్ ప్రసంగించారు. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఎందరో మహానుభావులు తెలుగు నేలపై జన్మించారని, వారి స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.