Supreme Court: బయటికి పంపించేస్తానన్న సీజేఐ.. తానే వెళ్లిపోతానన్న సీనియర్ న్యాయవాది!
- నీట్ రద్దుపై విచారణ సందర్భంగా సీజేఐ, సీనియర్ లాయర్ మధ్య వాగ్వాదం
- వాదనలు కొనసాగుతుండగా మధ్యలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసిన మాథ్యూస్
- పదేపదే అడ్డు తగలవద్దు... ఇలా చేస్తే పంపించేస్తానని సీజేఐ ఆగ్రహం
- కోర్టు నుంచి తానే వెళ్లిపోతానంటూ సీనియర్ అడ్వకేట్ మాథ్యూస్ వ్యాఖ్య
నీట్ పరీక్ష రద్దును కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఓ సమయంలో ఓ సీనియర్ న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే కోర్టు నుంచి పంపించేస్తానని హెచ్చరించారు. వాదనలకు అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ... తన వాదనలు వినాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మాథ్యూస్ జె నెడుంపర పదేపదే కోరడంతో సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదట పిటిషనర్ల తరఫున మరో సీనియర్ న్యాయవాది నరేందర్ హుడా వాదనలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో మాథ్యూస్ కల్పించుకొని... తనకు అవకాశం ఇవ్వాలని పదేపదే కోరారు.
'దయచేసి మీరు కూర్చోండి. ఇలా అడ్డు తగిలితే కోర్టు నుంచి పంపించివేయవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాను' అని సీజేఐ అన్నారు. అయితే గౌరవనీయులైన కోర్టు వారు తనను గౌరవించకుంటే తాను కోర్టు నుంచి వెళ్లిపోతానని... తన వాదనలు వినడం లేదని మాథ్యూస్ పలుమార్లు ఆరోపించారు.
దీంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కోర్టు ఇంఛార్జినని, నేను చెప్పేది మీరు వినాల్సిందేనని, 24 ఏళ్లుగా తాను న్యాయస్థానంలో ఉంటున్నానని, కోర్టును ఎలా నడిపించాలో తనకు తెలుసని... చెప్పాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. హుడా వాదనల తర్వాత మీ వాదనలను వింటానని స్పష్టం చేశారు.
సీజేఐ వ్యాఖ్యలపై మాథ్యూస్ స్పందిస్తూ... 1979 నుంచి తాను కోర్టును చూస్తున్నానని, ఇలా చేస్తే తాను వెళ్లిపోతానని చెబుతూ, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎన్టీఏ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ... సీనియర్ న్యాయవాది తీరును ధిక్కార చర్యగా అభివర్ణించారు.
ఆ తర్వాత, మాథ్యూస్ తిరిగి హాలులోకి వచ్చి తనను క్షమించాలని, అయినప్పటికీ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తన పట్ల అన్యాయంగా ప్రవర్తించారని వాపోయారు. కాసేపటికి ఆయనకు వాదనలు వినిపించడానికి సీజేఐ అవకాశమిచ్చారు. అయితే, వాదనల నుంచి తాను విరమించుకుంటున్నానని ఆయన ముగించారు.