Akhilesh Yadav: యూపీలోను ఏపీ వంటి పరిస్థితులే నెలకొన్నాయి.. జగన్ ధర్నాకు అఖిలేశ్ యాదవ్ సంఘీభావం
- వైసీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలో జగన్ ధర్నా
- కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ వీడియో చూపించి, వివరించిన జగన్
- విపక్షాలపై అరాచకాలు సరికాదన్న యూపీ మాజీ సీఎం
ఏపీలో ఈరోజు జగన్ అధికారంలో లేకపోవచ్చు... రేపు రావొచ్చు, కానీ ప్రతిపక్షాలపై దాడులు సరికాదని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్ జంతర్ మంతర్ వద్ద చేస్తోన్న దీక్షకు అఖిలేశ్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఏపీలో తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు చేస్తోందంటూ అఖిలేశ్‌కు జగన్ వీడియోలు చూపించారు.
అనంతరం అఖిలేశ్ మాట్లాడుతూ... విపక్షాలపై అరాచకాలు సృష్టించడం సరికాదన్నారు. ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇతర పక్షాలపై హింసకు దిగడం సరికాదన్నారు. ప్రాణాలు తీయడం, హత్యలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లవన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలోకి కొత్తగా బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీలోను ఏపీ వంటి పరిస్థితులే నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్డోజర్ సంస్కృతికి తాము వ్యతిరేకమని అఖిలేశ్ తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల కోసం జగన్ పోరాడుతున్నారన్నారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం అన్నారు. ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. జగన్ నిరసనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వహాబ్ మద్దతు తెలిపారు.