Pawan Kalyan: మాజీ మంత్రి కాకాణిపై పవన్ కల్యాణ్‌కు ముత్తుకూరు సర్పంచ్ ఫిర్యాదు
- సర్పంచ్ లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని పవన్‌కు వివరించిన సోమిరెడ్డి
- కాకాణి, వైసీపీ నాయకులు తనపై దౌర్జన్యం చేశారన్న సర్పంచ్
- మహిళల పట్ల దూషణకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవన్న పవన్
ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ముత్తుకూరు సర్పంచ్ లక్ష్మి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి లక్ష్మి పవన్‌ను కలిశారు. లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని సోమిరెడ్డి వివరించారు. కాకాణి, వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారంటూ లక్ష్మి ఉపముఖ్యమంత్రికి తెలిపారు.
బెదిరింపులకు దిగి బలవంతంగా సంతకాలు చేయించారని జనసేనాని దృష్టికి తీసుకు వెళ్లారు. లక్ష్మి ఫిర్యాదుపై పూర్తి వివరాలు తన ముందు ఉంచాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. మహిళల పట్ల కులదూషణకు పాల్పడ్డవారిపై చర్యలు తప్పవన్నారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ లక్ష్మి.. తాను గిరిజనురాలిని అని మూడేళ్లుగా వైసీపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి వేధించారని ఆరోపించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారన్నారు. సర్పంచ్‌ని తాను అయినప్పటికీ పాలన అంతా వైసీపీ నేతల ద్వారానే నడిచిందని పేర్కొన్నారు.