Vishnu Kumar Raju: ఈ శ్వేతపత్రం చూస్తే జగన్ సంబరపడిపోతారు: విష్ణుకుమార్ రాజు
- మద్యం అంశంలో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
- శ్వేతపత్రంలో పేర్కొన్న దానికంటే ఎక్కువే దోచుకున్నారన్న విష్ణుకుమార్
- రూ.30 వేల కోట్ల దోపిడీ జరిగితే... రూ.3,113 కోట్లు అని పేర్కొన్నారని అభ్యంతరం
సీఎం చంద్రబాబు ఇవాళ విడుదల చేసిన మద్యం శ్వేతపత్రంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పెదవి విరిచారు. ఈ శ్వేతపత్రం వాస్తవ దూరంగా ఉందని, ఈ శ్వేతపత్రాన్ని చూస్తే జగన్ సంబరపడిపోతారని వ్యాఖ్యానించారు. మద్యం అంశంలో వైసీపీ నేతలు దోచుకున్నదానికంటే శ్వేతపత్రంలో తక్కువ చూపించారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. శ్వేతపత్రంలో పేర్కొన్న దానికంటే చాలా ఎక్కువ దోపిడీనే జరిగిందని అన్నారు.
"మద్యం విషయంలో సుమారు రూ.30 వేల కోట్ల దోపిడీ జరిగిందని మేం లేఖ కూడా రాశాం. కానీ శ్వేతపత్రంలో రూ.3,113 కోట్లు అని పేర్కొన్నారు. ఇది వాస్తవానికి చాలా చాలా దూరంగా ఉంది. ఈ అంకెలు చూసి జగన్ మోహన్ రెడ్డి గారు చాలా సంతోషపడిపోతారు... నన్నేమీ పట్టుకోలేకపోయారే అని సంబరపడిపోతారు. దాదాపు రూ.99 వేల కోట్ల మేర నగదు రూపంలో అమ్మకాలు జరిగితే, 3 శాతం అక్రమాలే జరిగినట్టు శ్వేతపత్రంలో చెబుతున్నారు.
ప్రభుత్వం పట్ల మేం పూర్తి విధేయతతో ఉన్నాం. కానీ శ్వేతపత్రంలో చూపించిన మొత్తం చాలా తక్కువగా ఉంది. ఈ విషయంలో మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. దీనిపై సీఐడీ విచారణ కానీ, లేకపోతే సీబీఐ విచారణ కానీ జరిపించాలి" అని విష్ణుకుమార్ రాజు కోరారు.