C. V. Ananda Bose: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ పై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం .. ఘాటు వ్యాఖ్యలు
- ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్న గవర్నర్
- సదరు ఎమ్మెల్యేలకు జరిమానా విధించిన గవర్నర్ ఆనంద బోస్
- టిఫిన్ చేయడానికి డబ్బులు కావాలంటే నన్ను అడగండి .. ఏర్పాటు చేస్తానంటూ మమత వ్యాఖ్యలు
- గవర్నర్ ఆనంద బోస్ చర్యలపై సీఎం మమతా బెనర్జీ మండిపాటు
పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. గవర్నర్ ఆనంద బోస్ పై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “టిఫిన్ చేయడానికి డబ్బులు కావాలంటే నన్ను అడగండి.. నేను ఏర్పాటు చేస్తాను” అంటూ గవర్నర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంతకూ గవర్నర్ పై మమతా బెనర్జీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే..
కొత్తగా అసెంబ్లీకి హజరైన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, అందుకు గానూ వారు అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా, సభలో ఓటింగ్ లో పాల్గొనాలన్నా రోజుకు రూ.500 జరిమానా చెల్లించాలని గవర్నర్ ఆనంద బోస్ ఆదేశించారు. ఈ ఆదేశాలు సీఎం మమతా బెనర్జీకి ఆగ్రహం తెప్పించాయి.
గవర్నర్ ఆదేశాలపై బుధవారం సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. “నీట్ కుంభకోణంలో నేరస్తులకు జరిమానా విధించని గవర్నర్.. అసెంబ్లీకి ఎన్నికైన వారికి మాత్రం జరిమానా విధిస్తారా..? మీ దగ్గర డబ్బులు లేవా..? టిఫిన్ చేయడానికి డబ్బులు కావాలంటే నన్ను అడగండి. నేను ఏర్పాటు చేస్తాను” అంటూ వ్యాఖ్యానించారు.