Defaming Judges: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి రూ.1 లక్ష జరిమానా
- సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ వ్యక్తి
- కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడని తేల్చిన న్యాయస్థానం
- నిందితుడు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో కేసు నుంచి విముక్తి
- రూ.1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పు
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసి బేషరతుగా క్షమాపణలు చెప్పిన ఢిల్లీ వ్యక్తికి కోర్టు ధిక్కరణ ఆరోపణల నుంచి ఢిల్లీ హైకోర్టు విముక్తి కల్పించింది. అయితే, రూ.1 లక్ష జరిమానా మాత్రం విధించింది. రెండు వారాల లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని జస్టిస్ సురేశ్ కుమార్, జస్టిస్ మనోజ్ జైన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
ఢిల్లీకి చెందిన ఉదయ్‌పాల్ సింగ్ రెండేళ్ల క్రితం న్యాయమూర్తులను కించపరిచేలా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో వీడియో అప్‌లోడ్ చేశాడు. దీనిపై న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ నేరం కింద పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. అయితే, ఉదయ్‌పాల్ సింగ్ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తన వీడియో పర్యవసానాలను సరిగా అంచనా వేయలేకపోయానని అన్నారు. కేవలం తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేందుకు వీడియోలను అప్‌లోడ్ చేసినట్టు తెలిపారు.
ఉదయ్ పాల్ సింగ్ క్షమాపణలను ఆమోదించిన కోర్టు అతడికి కోర్టు ధిక్కరణ నేరం నుంచి విముక్తి కల్పించింది. అయితే, ప్రజాసమయాన్ని దుర్వినియోగం చేసినందుకు రూ.1 లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి, ఢిల్లీ ఇండిజెంట్ అండ్ డిసెబుల్డ్ లాయర్స్ ఫండ్, నిర్మల ఛాయా ఫండ్, భారత్‌కే వీర్ ఫండ్‌కు సమానంగా కేటాయిస్తూ తీర్పు వెలువరించింది.