Vangalapudi Anitha: బాధితులంతా వైసీపీ వాళ్లే అయితే ఆ కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదు?: హోంమంత్రి అనిత

Home Minister Vangalapudi Anitha on YS Jagan protest at Jantar Mantar
  • జగన్ ఢిల్లీ ధర్నాపై అధికార పక్ష నేతల ఆగ్రహం
  • జగన్ హయాంలోని దారుణాలను ఎగ్జిబిషన్ గా పెడితే సగం ఢిల్లీ సరిపోదంటూ వ్యాఖ్య 
  • వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం కూడా ఎందుకు చేయలేదని ప్రశ్న   
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయనీ, కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేయడంపై అధికార పక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. బుధవారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు సంఘీభావం తెలియజేశారు. దీనిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. 

జై జగన్ అనలేదని పల్నాడులో బీసీ నాయకుడు చంద్రయ్యను హత్య చేయడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని ఎమ్మెల్సీ అనంత బాబు డోర్ డెలివరీ చేయడం వంటి దారుణాలను ఫోటో ఎగ్జిబిషన్ గా పెడితే సగం ఢిల్లీ సరిపోదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్న జగన్ .. వాటి వివరాలు అందించాలని కోరారు. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం కూడా ఎందుకు చేయలేదని అడిగారు. వినుకొండలో గంజాయి మత్తులో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి ఆయన లబ్దిపొందాలని చూస్తున్నారని హోం మంత్రి విమర్శించారు.
Vangalapudi Anitha
Telugudesam
YS Jagan
YSRCP
Protest
New Delhi

More Telugu News