Kangana Ranaut: బీజేపీ ఎంపీ కంగన రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు.. వివరణకు ఆగస్టు 21 వరకు గడువు

BJP MP Kangana Ranaut Was Sent Notice By Himachal Pradesh High Court
  • మండి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి నిలిచిన లాయక్‌రామ్ నేగి
  • రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ పత్రాలను అకారణంగా తిరస్కరించారని ఆరోపణ
  • తాను బరిలో ఉండి ఉంటే తప్పకుండా గెలిచి ఉండేవాడినన్న నేగి
  • ఎన్నికను రద్దు చేయాలంటూ పిటిషన్ 
బాలీవుడ్ ప్రముఖ నటి, ఎంపీ కంగన రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అకారణంగా తిరస్కరించారని, లేదంటే తానే గెలిచి ఉండేవాడినని పేర్కొంటూ కిన్నౌర్‌వాసి లాయక్‌రామ్ నేగి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు ఆగస్టు 21లోగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎంపీని ఆదేశించింది.

అటవీ విభాగంలో పనిచేసిన నేగి ఎన్నికల బరిలోకి దిగేందుకు ముందస్తుగా ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలతోపాటు డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ‘నో డ్యూ’ సర్టిఫికెట్‌ను కూడా జతచేశారు. అయితే, విద్యుత్, తాగునీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని చెబుతూ రిటర్నింగ్ అధికారి ఒక రోజు గడువిచ్చారు. 

ఆ లోపే తాను వాటిని తీసుకెళ్లానని, కానీ రిటర్నింగ్ అధికారి వాటిని తీసుకునేందుకు నిరాకరించారని నేగి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఆ రోజు తన నామినేషన్ పత్రాలను అంగీకరించి ఉంటే ఆ ఎన్నికల్లో తాను తప్పకుండా గెలిచి ఉండేవాడినని, కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలని నేగి కోర్టును అభ్యర్థించారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన కంగన రనౌత్ మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్లతో విజయం సాధించారు.
Kangana Ranaut
Himachal Pradesh High Court
Mandi
BJP

More Telugu News