KCR: అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది: బడ్జెట్‌పై కేసీఆర్
- రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఆగ్రహం
- అట్టడుగు వర్గాల గొంతు కోసిందని ధ్వజం
- మహిళలకు వడ్డీ లేని రుణాలు పాత పథకమేనని వెల్లడి
ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.
యాదవ సోదరుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపకం పథకాన్ని మూసివేసినట్టు అర్థమవుతోందన్నారు. అట్టడుగు వర్గాల గొంతు కోసిందని ధ్వజమెత్తారు. దళితబంధు ప్రస్తావన లేదని... మత్స్యకారులకు భరోసా లేదన్నారు. అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థికమంత్రి ఒత్తిఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మహిళలకు లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారని... కానీ ఇది పాత పథకమే అన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేం కూడా కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని భావించామని, తాను కూడా శాసన సభకు రాలేదని, కానీ ఈ రోజు బడ్జెట్‌ను చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదని ఆరోపించారు. వ్యవసాయం విషయంలో తమకు స్పష్టమైన అవగాహన ఉండేదన్నారు. కానీ ఇది రైతు శత్రు ప్రభుత్వమన్నారు. ధాన్యం కొనుగోలు చేయలేదని... విద్యుత్ సరఫరా చేయడం లేదని... నీళ్లు సరఫరా చేయడం లేదని ఆరోపించారు.
ఇంకా రైతుబంధు, రైతు భరోసా ప్రస్తావనే లేదన్నారు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారని తమ ఎమ్మెల్యేలు అడిగితే కనీసం సమాధానం చెప్పడం లేదన్నారు. రైతులను, వృత్తి కార్మికులను ఈ ప్రభుత్వం వంచించిందన్నారు. బడ్జెట్ ప్రసంగంలా కనిపించలేదని... రాజకీయ సభలలో చెప్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ... ఇలా ఏ అంశంపై స్పష్టత లేదన్నారు.