Telangana: పసలేని.. దిశలేని.. దండగమారి బడ్జెట్: తెలంగాణ బడ్జెట్‌పై కేటీఆర్

KTR responds on Telangana Budget

  • ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు అని విమర్శ
  • గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల.. ఎగవేతల బడ్జెట్ అని ఆగ్రహం
  • డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన... దోకేబాజ్ బడ్జెట్ అని మండిపాటు

తెలంగాణ బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు అని విమర్శించారు. గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల.. ఎగవేతల బడ్జెట్ అన్నారు. వాగ్దానాలను గాలికొదిలిన.. వంచనల బడ్జెట్ అని పేర్కొన్నారు. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన... దోకేబాజ్ బడ్జెట్ అన్నారు.

విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కత్తిరింపులు... అన్నదాతలకు సున్నం అని చురక అంటించారు. ఆడబిడ్డలకు అన్యాయం.. మహాలక్ష్ములకు మహామోసమని ధ్వజమెత్తారు. అవ్వాతాతలకు.. దివ్యాంగులకు.. నిరుపేదలకు... నిస్సహాయులకు మొండిచేయి చూపారని ఆరోపించారు. పెన్షన్ల పెంపు మాటెత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితులకు దగా.. గిరిజనులకు మోసం.. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు.. శూన్యహస్తమే మిగిలిందన్నారు. బడుగు.. బలహీన వర్గాలకు భరోసాలేదు.. వృత్తి కులాలపై కత్తికట్టారన్నారు. మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలయ్యాయని విమర్శించారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు.. 4 వేల భృతి జాడా పత్తా లేదని పేర్కొన్నారు. విద్యార్థులపై కూడా వివక్ష చూపారని ఆరోపించారు. 5 లక్షల భరోసా కార్డు ముచ్చటే లేదన్నారు.

హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు.. మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్నకు చేయూత లేదు.. ఆటో అన్నలకు అండదండ లేదన్నారు. ఆత్మహత్యపాలైన కుటుంబాలను ఆదుకోవాలన్న మానవీయ కోణమే లేదని విమర్శించారు. మొత్తంగా.. పసలేని.. దిశలేని.. దండగమారి బడ్జెట్ అన్నారు.

  • Loading...

More Telugu News