Kamala Harris: కమలా హ్యారీస్‌కు సంపూర్ణ మద్దతు: బరాక్ ఒబామా
- భార్య మిచెల్లీ ఒబామాతో కలిసి ఫోన్ చేసి మద్దతు ప్రకటించిన మాజీ అధ్యక్షుడు
- సంక్లిష్ట సమయంలో ఉండాల్సిన గొప్ప లక్షణాలు మీలో ఉన్నాయంటూ ప్రశంస
- హర్షం వ్యక్తం చేసిన డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారీస్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినీగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ నిలబడడం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇష్టం లేదంటూ కొన్ని రోజులుగా వెలువడుతున్న ఊహాగానాలకు తెరపడింది. కమలా హ్యారీస్‌కు ఒబామా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కీలక పరిణామం జరిగింది. ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా ఇద్దరూ కలిసి కమలా హ్యారీస్‌కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. సంక్లిష్టమైన ఈ సమయంలో ఉండాల్సిన దూర దృష్టి, సామర్థ్యం, చక్కటి స్వభావం ఉన్నాయని ఒబామా కొనియాడారు. చరిత్ర సృష్టించబోతున్నామని ఆమెను ఉత్సాహపరిచారు. ఈ మేరకు ప్రైవేట్ ఫోన్ కాల్‌కు సంబంధించిన సంభాషణ వీడియోను అధికారికంగా షేర్ చేశారు.
‘‘ నేను, మిచెల్లీ మీకు ఫోన్ చేసింది కేవలం మీకు మద్దతు తెలపడానికే కాదు. మిమ్మల్ని ఓవల్ ఆఫీస్‌కు తీసుకెళ్లేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. ఈ విషయం మీకు తెలియజేయడానికి గర్వపడుతున్నాను’’ అని ఒబామా పేర్కొన్నారు. ‘‘మీ పట్ల ఆప్యాయత లేకుంటే ఈ ఫోన్ కాల్ చేసేవాళ్లం కాదు. మిమ్మల్ని చూసి మేము గర్వపడుతున్నాం‘‘ అని మిచెల్ ఒబామా అన్నారు.
‘‘మిచెల్, బరాక్ మీరు నాకు ఫోన్ చేయడం చాలా గొప్పం విషయం’’ అని కమలా హ్యారీస్ అన్నారు. ‘‘మీ ఇద్దరితో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. నా భర్త డగ్, నేను మీరు మాట్లాడిన మాటలను, ఇన్నేళ్లు మాతో కొనసాగించిన స్నేహం మాటల్లో చెప్పడం కంటే చాలా ఎక్కువ. మీ ఇద్దరికీ ధన్యవాదాలు’’ అని కమలా హ్యారీస్ పేర్కొన్నారు. ఫోన్ కాల్ అనంతరం ఎక్స్ వేదికగా కూడా ఈ మేరకు బరాక్ ఒబామా ప్రకటన చేశారు.