France Rain Network: ‘పారిస్ ఒలింపిక్స్‌’ ఆరంభానికి ముందు ఫ్రాన్స్‌లో దుశ్చర్య.. నిలిచిపోయిన ఫ్రెంచ్ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్

Frances high speed rail network TGV was hit by malicious acts
  • హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌పై భారీ కుట్ర దాడి
  • అనేక చోట్ల రైల్వే సౌకర్యాల దహనం
  • ఏకకాలంలో విధ్వంస దాడులు
  • పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు దుశ్చర్య
‘పారిస్ ఒలింపిక్స్’ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఆతిథ్య దేశం ఫ్రాన్స్‌లో టీజీవీ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ పూర్తిగా స్తంభించింది. రైల్వే ట్రాకులపై విధ్వంసకారులు కుట్రపూరిత దాడులకు పాల్పడ్డారు. అనేక చోట్ల ట్రాకులు, రైల్వే సౌకర్యాలను దహనం చేశారు. అత్యంత హానికరమైన ఈ చర్యలతో ఇంటర్‌సిటీ హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌గా ఉన్న టీజీవీ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. ఏకంగా 8 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం జరిగిందని టీజీవీ నెట్‌వర్క్ నిర్వహణ సంస్థ ఎస్ఎన్‌సీఎఫ్ శుక్రవారం ప్రకటించింది. సమన్వయంతో ఈ విధ్వంస చర్యలకు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు చేయబోతున్నట్టు ఎస్ఎన్‌సీఎఫ్‌సీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

టీజీవీ నెట్‌వర్క్‌ను స్తంభింపజేయడానికి జరిగిన భారీ దాడి ఇది అని, అనేక రూట్లలో రైళ్లను రద్దు చేయాల్సి ఉంటుందని ఎస్ఎన్‌సీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జీన్-పియర్ ఫారండో  వివరించారు. రాత్రి ఏకకాలంలో ఈ హానికరమైన దాడులకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. ఈ దాడుల కారణంగా ఉత్తర, తూర్పు మార్గాల్లో రైలు నెట్‌వర్క్ ప్రభావితం అయిందని చెప్పారు. రైలు నెట్‌వర్క్ సౌకర్యాలను దెబ్బతీసేందుకు దాడులకు పాల్పడ్డారని, ప్రభావిత మార్గాలలో రైళ్ల ప్రయాణాలకు భారీ అంతరాయం కలిగిందని జీన్-పియర్ వివరించారు. మరమ్మతులు మొదలయ్యాయని, అయితే వారాంతం వరకు పనులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.

8 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారని, పలు రైళ్లను వేర్వేరు ట్రాక్‌లకు మళ్లించినట్టు తెలిపారు. పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని వివరించారు. సోమవారం నుంచి తిరిగి సర్వీసులు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.

అనూహ్యమైన ఈ పరిణామంపై ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి ప్యాట్రిస్ స్పందించారు. టీజీవీ రైలు నెట్‌వర్క్‌పై భారీ దాడి జరిగిందని వ్యాఖ్యానించారు. ఇది తీవ్రమైన నేరపూరిత చర్య అని, పారిస్ ఒలింపిక్స్ ఆరంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం జరిగిందన్నారు. కాగా ఎవరు ఈ దాడులకు పాల్పడ్డారనే విషయం తెలియాల్సి ఉంది.
France Rain Network
TGV Network
SNCF
Paris Olympics

More Telugu News