Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు
- ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
- అయినా దాని ప్రభావం ఏపీపై ఉండదన్న వాతావరణశాఖ
- రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు
ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణశాఖ వెల్లడించింది. అయితే, దీని ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశం లేదని తెలిపింది. వచ్చే రెండ్రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ మీదుగా పయనిస్తుందని పేర్కొంది.
మరోవైపు, ఒడిశా మీదుగా తూర్పు, పడమరగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న కోస్తాలో పలుచోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడగా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.