Techi Suicide: దుర్గం చెరువులో దూకి హైదరాబాదీ టెకీ ఆత్మహత్య!
- ముషీరాబాద్‌కు చెందిన బాలాజీ అనే యువకుడి బలవన్మరణం
- పెళ్లి విషయంలో ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసుల అంచనా
- పెళ్లి చేసుకోవాలంటూ ప్రేయసి నుంచి ఒత్తిడి
- తన ఇంట్లోవారికి చెప్పలేక యువకుడి సతమతం, చివరకు బలవన్మరణం
పెళ్లి విషయంలో గర్ల్‌ఫ్రెండ్, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో తట్టుకోలేకపోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముషీరాబాద్‌కు చెందిన బాలాజీ (25) మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న ఆఫీసుకు వెళ్లిన బాలాజీ రాత్రి పొద్దుపోయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో, ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అతడికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. అతడి స్నేహితులను కనుక్కున్నా బాలాజీ జాడ తెలియరాలేదు. దీంతో, వారు మరుసటి రోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలాజీ పనిచేస్తున్న కంపెనీలో విచారించగా అతడు ఆ రోజు పని ముగించుకుని రాత్రి 8.30 గంటలకు బయటకు వెళ్లినట్టు తెలిసింది. దీంతో, సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతడు కేబుల్ బ్రిడ్జి నుంచి దుర్గం చెరువులోకి దూకినట్టు గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం సాయంత్రం చెరువులో అతడి మృతదేహం లభించింది. ఐడీ కార్డుతో మృతుడిని బాలాజీగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కాగా, బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. యువతి పెళ్లికోసం ఒత్తిడి చేయగా ఈ విషయాన్ని బాలాజీ తన ఇంట్లోవారికి చెప్పలేక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.