Andhra Pradesh: పెద్దవాగుకు గండి... పరిశీలనకు వెళ్తూ తెలంగాణలో ఆగిన ఏపీ మంత్రులు
- వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన పలు గ్రామాల్లో నష్టం
- జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుకు గండిపడిందని ఆగ్రహం
- వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు
పెద్దవాగు ప్రాజెక్టుపై ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టుకు గండిపడిందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు విమర్శించారు. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన పలు గ్రామాల్లో నష్టం జరిగింది. ఈ మండలాల పర్యటనకు ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పార్థసారథి... వెళుతూ అశ్వారావుపేటలో అగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 2022లోనే రెండు రాష్ట్రాల నీటిపారుదల అధికారులు నిధుల కోసం చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు. అందుకే రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ ఏడాది నుంచే రైతులకు తెలంగాణ ప్రభుత్వం నీరు అందించే ఏర్పాట్లను చేపట్టిందని, ఇందుకోసం రూ.3.5 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.
వరద ప్రభావ ప్రాంతాల్లో పరిశీలన
పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కేంద్రానికి మంత్రులు వెళ్లి అక్కడి నిర్వాసితులతో మాట్లాడారు. వారిని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి కూడా అడిగారు. ఆర్ అండ్ బీ నిధులు జమ కాలేదని వారు మంత్రులకు తెలిపారు. పునరావాస కాలనీల్లో రోడ్లు, మరుగుదొడ్ల సమస్యను వివరించారు. త్వరగా బయోటాయిలెట్లు ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు భారీ గండి పడింది. గురువారం రాత్రంతా నీరు దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది.