Kamala Harris: కమలా హ్యారీస్‌దే పైచేయి.. తాజా పోల్ సర్వేలో ట్రంప్‌పై ఆధిపత్యం

Democratic Party likly nominee Kamala Harris has narrowed the margin against Donald Trump
  • వాల్‌స్ట్రీట్ జర్నల్ పోల్ సర్వేలో కమలకు ఆధిక్యం
  • 2 శాతం పాయింట్లతో వెనుకబడ్డ ట్రంప్
  • కమలా హ్యారీస్‌కు క్రమంగా పెరుగుతున్న ఆదరణ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా దాదాపు ఖరారైన వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్‌కు ఆదరణ పెరుగుతోంది. తాజా పోల్ సర్వేలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆమె పైచేయి సాధించారు. ట్రంప్ కంటే కమలాకు స్వల్ప మెజారిటీ ఆదరణ దక్కింది. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తాజాగా నిర్వహించిన పోల్‌లో కమలా హ్యారీస్‌ను 49 శాతం, డొనాల్డ్ ట్రంప్‌ను 47 శాతం మంది ప్రెసిడెంట్‌గా కావాలని కోరుకున్నారు. అయితే ఈ పోల్ ఫలితం ప్లస్ లేదా మైనస్ 3.1 శాతం పాయింట్లు ‘ఎర్రర్ మార్జిన్‌’గా ఉన్నాయి.

ముఖ్యంగా శ్వేతజాతీయేతర ఓటర్లు, డెమొక్రాటిక్ పార్టీ శ్రేణుల్లో ఆమెకు మద్దతు గణనీయంగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు.. కమలా హ్యారీస్‌కు ప్రధానంగా డెమొక్రాటిక్ సంకీర్ణ పార్టీల మద్దతు పెరిగింది. జో బైడెన్ మరోసారి పోటీ చేసేందుకు ఈ పార్టీలు.. ఆయన తప్పుకోవడంతో కమలా హ్యారీస్‌కు మద్దతు తెలుపుతున్నాయి. అంతే కాకుండా హిస్పానిక్ ఓటర్లలో (స్పానిష్ మాట్లాడే వారు) కూడా హ్యారీస్‌కు మద్దతు పెరుగుతోంది.  45 శాతం నుంచి 57 శాతానికి పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. నెల క్రితం నిర్వహించిన న్యూయార్క్ టైమ్స్ పోల్‌లో ప్రెసిడెంట్ బైడెన్‌కు 59 శాతం మంది నమోదిత నల్లజాతి ఓటర్లు మద్దతు తెలపగా ఇప్పుడు కమలాకు మద్దతు తెలిపేవారి సంఖ్య 69 శాతానికి పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు.

ఇక జులై 22-24 మధ్య దేశవ్యాప్తంగా న్యూయార్క్ టైమ్స్/సియనా కాలేజీ పోల్ నిర్వహించిన పోల్ సర్వేలో ట్రంప్‌కు 48 శాతం, కమలా హ్యారీస్‌కు 47 శాతం పాయింట్లు లభించాయి. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఇతర పోల్ సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ కూడా ఇదే పేర్కొంది. బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన తర్వాత నిర్వహించిన పోల్‌లలో ట్రంప్ కంటే కమలా హ్యారీస్ సగటున 1.6 శాతం పాయింట్ల స్వల్ప వ్యత్యాసంతో వెనుకంజలో ఉన్నారని పేర్కొంది.

కాగా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడానికి ముందు ఈ నెల ఆరంభంలో ట్రంప్ 6 శాతం పాయింట్లతో ఆధిక్యంలో నిలిచారు. కాగా కమలా హ్యారిస్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినీగా తన అభ్యర్థిత్వాన్ని శనివారం ప్రకటించారు. అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే పత్రాలపై ఆమె సంతకం కూడా చేశారు. ప్రతి ఓటును పొందడానికి తాను కష్టపడి పని చేస్తానంటూ ఎక్స్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.
Kamala Harris
Donald Trump
US Presidential Polls
USA

More Telugu News