Mamata Banerjee: మమతా బెనర్జీ ఆరోపణల్లో నిజం లేదన్న కేంద్రం... చంద్రబాబు 20 నిమిషాలు మాట్లాడారన్న దీదీ

Mamata reacts in PIB Fact Check over mic issue in NITI Aayog meeting
  • ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన మమతా బెనర్జీ
  • తనను ఐదు నిమిషాలు కూడా మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేశారని ఆరోపణ
  • మమతా ఆరోపణల్లో నిజంలేదన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
  • ఇతర సీఎంలకు అధిక సమయం ఇచ్చారన్న మమత
ఇవాళ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడనివ్వలేదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించడం తెలిసిందే. తనను ఐదు నిమిషాలు కూడా మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేశారని ఆమె వెల్లడించారు.  

అయితే, మమతా ఆరోపణలను కేంద్రం ఖండించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా మమతా వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. 

"పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతుంటే మైక్ ఆపేశారన్న ఆరోపణలు తప్పు. ఆమెకు కేటాయించిన సమయం అయిపోయిందని గడియారం స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతుండగానే బెల్ మోగించారన్నది అవాస్తవం. వాస్తవానికి నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడేందుకు సీఎంలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అనుమతించారు. ఆ లెక్కన మమతా బెనర్జీ వంతు మధ్యాహ్న భోజనం తర్వాత వస్తుంది. కానీ తాను త్వరగా వెళ్లిపోవాల్సి ఉందని చెప్పడంతో మమతాను ముందు మాట్లాడేందుకు అనుమతించారు" అని పీఐబీ వివరించింది. 

కాగా, ఢిల్లీ నుంచి కోల్ కతా చేరుకున్న అనంతరం మమతా బెనర్జీని ఇదే అంశంపై మీడియా స్పందన కోరింది. పీఐబీ చేసిన ఫ్యాక్ట్ చెక్ పై మమతా ఈ సందర్భంగా ఏమన్నారంటే... నిజాన్ని దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నమే ఈ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అని వ్యాఖ్యానించారు.

"నా కంటే ముందు మాట్లాడిన చంద్రబాబు 20 నిమిషాల పాటు మాట్లాడారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల్లో కొందరు 15 నిమిషాల పాటు మాట్లాడారు, కొందరు 16 నిమిషాలు మాట్లాడారు. కానీ నేను ఐదు నిమిషాలు కూడా మాట్లాడకముందే మీ సమయం అయిపోయిందన్నట్టు గంట మోగించారు. అందుకే నేను వాకౌట్ చేశాను" అని దీదీ వివరించారు. 

తనలాంటి సీనియర్ రాజకీయవేత్త పట్ల సమావేశంలో వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి విపక్షాల నుంచి హాజరైన ఒకే ఒక్క ముఖ్యమంత్రినని, కనీసం అందుకైనా తనకు విలువ ఇచ్చి ఉంటే బాగుండేదని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఆ సమావేశం నుంచి వాకౌట్ చేయడం సరైన చర్య అని భావిస్తున్నానని తెలిపారు.
Mamata Banerjee
PIB Fact Check
Niti Aayog
Mic
Chandrababu
West Bengal

More Telugu News