Chandrababu: పోలవరం ప్రాజెక్టులో తొలి దశ లేదు, మలి దశ లేదు... పూర్తి చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
- ఢిల్లీలో నేడు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు
- అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ
- భేటీ ముగిసిన అనంతరం ప్రెస్ మీట్
- పోలవరం ప్రాజెక్టు ఖర్చులకు ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ఆమోదం లభించిందని వెల్లడి
- కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంపై క్యాబినెట్ నోట్ ను సీఆర్ పాటిల్ కు అందించినట్టు వివరణ
ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చ సాగింది. సమావేశం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై నిధుల ఖర్చుకు ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇన్వెస్ట్ మెంట్ బోర్డు అంశం కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్లాల్సి ఉందని వివరించారు.
పోలవరంలో తొలి దశ లేదు, మలి దశ లేదు... ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మరో సీజన్ కూడా కోల్పోతామని అన్నారు.
పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించామని, దీనిపై రాష్ట్ర క్యాబినెట్ లో చర్చించామని వెల్లడించారు. డయాఫ్రం వాల్ నిర్మించాలన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తాలూకు నోట్ ను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు అందించినట్టు చంద్రబాబు తెలిపారు. వరద తగ్గాక పనులు ప్రారంభిస్తే, ప్రాజెక్టు ఓ కొలిక్కి రావడానికి మరో రెండేళ్లు పడుతుందని అన్నారు.
వైసీపీ పాలనలో అప్పులు పెరిగాయని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరానని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు ఇవ్వాలని కోరామని తెలిపారు.
స్వచ్ఛ భారత్, జల జీవన్ మిషన్ కార్యక్రమాల్లో ఏపీ వెనుకబడి ఉందని అన్నారు. ఈ రెండు పథకాల అమలులో ఏపీ చివరి నుంచి మూడో స్థానంలో ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో కేంద్రం నిధులను దారిమళ్లించారని ఆరోపించారు.