Donald Trump: క్రైస్తవులారా బయటకొచ్చి ఓటు వేయండి.. ఆ సమస్య పరిష్కారం అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
- క్రిస్టియన్లు అంటే ఇష్టమన్న ట్రంప్
- తనకు ఓటు వేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని హామీ
- స్పష్టంగా అర్థం కాని ట్రంప్ వ్యాఖ్యల పరమార్థం
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. డెమొక్రాటిక్ పార్టీ నామినీగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఖరారైన తర్వాత ప్రచార కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం క్రిస్టియన్లను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘‘క్రైస్తవులారా.. ఈసారి కచ్చితంగా బయటకు వచ్చి ఓటు వేయండి. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఓటు వేస్తే వచ్చే నాలుగేళ్లలో మళ్లీ ఓటు వేయాల్సిన అవసరం ఉండదు. మరో నాలుగేళ్లలో అది పరిష్కారం అవుతుంది. అదేంటో మీకు తెలుసు. క్రైస్తవులారా మీరంటే నాకెంతో ఇష్టం. నేను కూడా క్రైస్తవుడని. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను. మీరంతా బయటకు వచ్చి ఓటు వేయండి. ఆ సమస్యను చక్కగా పరిష్కరిద్దాం. అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ‘టర్నింగ్ పాయింట్ యాక్షన్’ అనే సంప్రదాయ గ్రూప్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు.
కాగా ఈ వ్యాఖ్యల ద్వారా ట్రంప్ ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా అర్థం కావడంలేదని అమెరికా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ మాట్లాడుతూ.. అమెరికాను ఏకం చేయడం గురించి ట్రంప్ మాట్లాడారని అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలకు స్పష్టమైన అర్థం తెలియక పోయినప్పటికీ ఈ వ్యాఖ్యలపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదిలావుంచితే.. గత రెండు ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లు డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా పడ్డాయి.