Manu Bhaker: ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుపుపై స్పందించిన మను భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకం అందించిన షూటర్ మను భాకర్ తన విజయంపై స్పందించింది. ఈ పతకం భారత్‌కు ఎప్పుడో రావాల్సిందని, ఇన్నాళ్లకు సాకారమైందని, అందుకు తాను ఒక మాధ్యమంలా ఉపయోగపడ్డానని వినమ్రంగా వ్యాఖ్యానించింది.
భారత్ ఇంకా ఎక్కువ పతకాలు సాధించాలని, ఈసారి వీలైనన్ని ఎక్కువ పతకాలు కొల్లగొట్టాలని తాము ఎదురు చూస్తున్నామని ఆమె చెప్పింది. వ్యక్తిగతంగా తనకు ఇదంతా ఒక కలలాగా ఉందని, ఆఖరి షాట్ వరకు తాను పూర్తి స్థాయిలో పోరాడానని చెప్పింది. ఇప్పుడు వచ్చింది కాంస్యం మాత్రమేనని, ‘బెటర్ లక్ నెక్స్ట్ టైమ్’ అని వ్యాఖ్యానించింది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు ముందు ఎలా గడిపారని ప్రశ్నించగా మను భాకర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ‘‘నిజాయతీగా చెప్పాలంటే... నేను భగవద్గీత బాగా చదివాను. అందుకే నా మనసులో 'నువ్వు ఏం చేయగలవో అది చేయి. నువ్వు చేయాల్సిన కృషి చేయి. ఫలితాన్ని ఆశించకు... అనే మాటలే నా మదిలో మెదిలాయి. విధి రాతని మనం మార్చలేం. చేయాల్సిన పని మీదే దృష్టి పెట్టాలి. ఫలితం మీద కాదు అంటూ భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ మాటలే నా బుర్రలో కదిలాయి’’ అని మను భాకర్ పేర్కొంది.
టోక్యో ఒలింపిక్స్ లో తాను చాలా చాలా నిరుత్సాహానికి గురయ్యానని, ఆ విచారాన్ని అధిగమించడానికి తనకు చాలా సమయం పట్టిందని మను భాకర్ గుర్తుచేసుకుంది. గడిచిందేదో గడిచిపోయిందని, వర్తమానంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పింది. ఈ పతకం టీమ్ ఉమ్మడి కృషి వల్ల వచ్చిందని, తాను ఒక మాధ్యమంగా ఉన్నానని, అందుకే తనకు చాలా సంతోషంగా ఉందని మను భాకర్ హర్షం వ్యక్తం చేసింది.
కాగా మను భాకర్ ఆదివారం చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యాన్ని సాధించింది. ఒలింపిక్స్ షూటింగ్‌లో మెడల్ గెలిచిన తొలి మహిళగా ఆమె నిలిచింది. ఈ గెలుపుతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ కొట్టింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ చివరిసారిగా పతకాలు గెలిచింది. ర్యాపిడ్-ఫైర్ పిస్టల్ షూటర్ విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం సాధించారు.