Lineman Ramaiah: ప్రాణాలకు తెగించి సేవలందించిన లైన్ మన్ రామయ్యను అభినందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
- ఇటీవల ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
- అల్లూరి జిల్లాల్లో పొంగిపొర్లిన వాగులు
- తీగలపై నడుస్తూ వాగు దాటి వెళ్లి మరమ్మతులు చేసిన లైన్ మన్ రామయ్య
- పలు గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ
- రామయ్య సాహసం విద్యుత్ ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకమన్న మంత్రి
ఇటీవల ఉత్తరాంధ్రను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ నేపథ్యంలో, సున్నంపాడు-దేవరపల్లికి మధ్య విద్యుత్ లైను దెబ్బతినడంతో సరఫరా నిలిచిపోయింది.
అయితే, మధ్యలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ... ప్రాణాలను లెక్కచేయకుండా, విద్యుత్ లైన్ మన్ కూర రామయ్య తీగలపై నడుచుకుంటూ వాగు దాటి వెళ్లి మరమ్మతులు చేశాడు. తద్వారా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించగలిగారు.
కాగా, ఈ లైన్ మన్ రామయ్య సాహసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్లింది. ఆయన ఇవాళ రామయ్య సాహసాన్ని వేనోళ్ల కొనియాడారు. భయపడకుండా విధులు నిర్వర్తించడం పట్ల అభినందించారు. రామయ్య సాహసం రాష్ట్ర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకం అని అభివర్ణించారు. ఇది ఎంతోమంది ఉద్యోగుల్లో చైతన్యం నింపుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.
ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని రామయ్య మరోసారి రుజువు చేశాడని ప్రశంసించారు. ఈ మేరకు రామయ్య తీగలపై నడుచుకుంటూ వాగు దాటిన వీడియోను కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంచుకున్నారు.