India vs Sri Lanka: రెండవ టీ20లో అలవోకగా శ్రీలంకపై భారత్ గెలుపు.. రవి బిష్ణోయ్ మెరుపులు
- వరుసగా రెండవ గెలుపుతో సిరీస్ సొంతం చేసుకున్న భారత్
- వర్షం అంతరాయంతో భారత్ లక్ష్యం 8 ఓవర్లలో 78 పరుగులకు కుదింపు
- మూడు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన స్పిన్నర్ రవి బిష్ణోయ్
ఆతిథ్య దేశం శ్రీలంకపై భారత్ వరుసగా రెండవ టీ20 విజయాన్ని నమోదు చేసింది. పల్లెకెలె వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత విజయ లక్ష్యాన్ని అంపైర్లు 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు.
ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ దూకుడుగా ఆడడంతో లక్ష్యం చిన్నబోయింది. జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులు, సూర్య 12 బంతుల్లో 26 పరుగులు, హార్ధిక్ పాండ్యా 9 బంతుల్లో 22 రన్స్ (నాటౌట్), పంత్ 2 రన్స్ (నాటౌట్) చొప్పున బాదారు. దీంతో మరో 9 బంతులు మిగిలివుండగానే భారత్ లక్ష్యాన్ని చేరింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2 విజయాలు సాధించడంతో సిరీస్ భారత్ వశమైంది.
కాగా శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా అర్ధ శతకంతో మంచి ఊపు మీద ఉన్నట్టు కనిపించాడు. అయితే అతడిని రవి బిష్ణోయ్ బోల్తా కొట్టించాడు. పాతుమ్ నిస్సాంకతో కలిసి రెండవ వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఒక దశలో భారీ స్కోరు చేసేలా కనిపించారు. అయితే భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఒక దశలో స్కోరు 130/2గా ఉండగా 20 ఓవర్లు ముగిసేసరికి 161/9 కుప్పకూలింది. రవి బిష్ణోయ్ 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యా తలో 2 చొప్పున వికెట్లు తీశారు. కాగా వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడ సమస్యతో బాధపడుతుండడంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ ఈ మ్యాచ్ ఆడాడు.