Paris Olympics: ఒలింపిక్స్‌లో మహిళా క్రీడాకారులపై టీవీ వ్యాఖ్యాత లైవ్‌లో షాకింగ్ కామెంట్స్!
ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా మహిళల స్విమ్మింగ్ జట్టుపై వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన టీవీ షో వ్యాఖ్యాతపై వేటు పడింది. యాంకర్ కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో యూరోస్పోర్ట్స్ ఛానల్ ఆయనను తొలగించినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. పారిస్ ఒలింపిక్స్ 4 బై 100 ఫ్రీ స్టైల్ రిలే స్విమ్మింగ్ విభాగంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలుపొందింది. దీనిపై యాంకర్ బలార్డ్ స్పందిస్తూ..‘‘ ఓకే.. మహిళలూ పూర్తి చేశారు. వీళ్ల గురించి తెలిసిందేగా.. మేకప్ గట్రా అంటూ తీరిగ్గా ఉంటారు’’ అని లైవ్‌లో సంచలన కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్‌పై బలార్డ్ సహ వ్యాఖ్యాత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు, నెట్టింట ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై మరుసటి రోజు యూరోస్పోర్ట్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళలపై బలార్డ్ వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారని అంగీకరించింది. ఆయనను తక్షణం తప్పించినట్టు పేర్కొంది. అయితే, ఈ కాంట్రవర్సీపై బలార్డ్ ఇంకా స్పందించలేదు. ఇక, రిలే స్విమ్మింగ్ 4 బై 100 విభాగంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు బంగారు పతకం సొంతం చేసుకుంది.