Surya Kumar Yadav: కెప్టెన్‌గా అనుకోవడం లేదు: సూర్యకుమార్ యాదవ్

I do not want to be a captain and I want to be a leader says Surya Kumar Yadav
  • తనని తాను కెప్టెన్‌గా వర్గీకరించుకోనున్న సూర్య
  • నాయకుడిగా ఉండాలనుకుంటున్నానన్న కెప్టెన్
  • శ్రీలంకతో తొలి టీ20 తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత జట్టు టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న సూర్య కుమార్ యాదవ్‌ ప్రశంసలు అందుకుంటున్నాడు. శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో క్లిష్ట సమయంలో తెలివిగా బౌలర్లను ఉపయోగించిన తీరుపై మాజీలు సైతం మెచ్చుకుంటున్నారు. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్సీపై సూర్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తనను తాను కెప్టెన్‌గా కాకుండా ఒక నాయకుడిగా వర్గీకరించుకుంటానని సూర్య చెప్పాడు. తనకు కెప్టెన్‌గా ఉండాలని లేదని, జట్టుకు ఒక లీడర్‌గా ఉండాలనుకుంటానని వ్యాఖ్యానించాడు. 

కీలక సమయంలో యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌ను బౌలింగ్‌కు దించడంపై స్పందిస్తూ.. అతడి బౌలింగ్‌ ప్రత్యేకంగా ఉంటుందని, ఐపీఎల్‌తో పాటు నెట్స్‌లో బౌలింగ్ చేయడం తాను చూశానని సూర్య చెప్పాడు. జట్టుకు రియాన్ అదనపు బలం అని భావించామని చెప్పాడు. ఇక శ్రీలంకలో భారత జట్టుకు ఇంత చక్కటి మద్దతు లభిస్తుండడం తనకు చాలా ఆనందంగా అనిపిస్తోందని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను బీసీసీఐ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.

కాగా శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ తన కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించాడు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్ అద్భుతంగా రాణించారు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 84/0గా ఉంది. లంక సునాయాసంగా లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్టుగా కనిపించింది. ఆ సమయంలో సూర్య కుమార్ తన కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించాడు.

అప్పటికే ఐదుగురు ప్రధాన బౌలర్లను ఉపయోగించిన సూర్య.. తొమ్మిదో ఓవర్‌లో వ్యూహాత్మకంగా అర్ష్‌దీప్ సింగ్‌ను బౌలింగ్‌కు తీసుకొచ్చాడు. అతడు కుశాల్ మెండిస్‌ వికెట్‌ను తీశాడు. అయినప్పటికీ లంక దూకుడు ఆగలేదు. దీంతో 15వ ఓవర్‌లో అక్షర్ పటేల్‌ను సూర్య దించాడు. పిచ్‌పై బంతి టర్న్‌ అవుతుండడంతో అక్షర్ మ్యాజిక్ చేశాడు. కుశాల్ పెరీరా, క్రీజులో పాతుకుపోయిన నిస్సాంకాను అవుట్ చేశాడు. అంతటితో ఆగని సూర్య యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌ను రంగంలోకి దించాడు. అతడు ఏకంగా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సూర్య కెప్టెన్సీ నైపుణ్యాలను భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు.
Surya Kumar Yadav
Team India
India vs Sri Lanka
Cricket

More Telugu News