YS Sharmila: ఏపీ అంటే కేంద్రానికి ఎందుకింత నిర్లక్ష్యం?: వైఎస్ షర్మిల

YS Sharmila asks state and union govts why do not help AP farmers hit by floods
  • ఏపీలో ఇటీవల భారీ వర్షాలు
  • ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితులు
  • మీ నీతి ఆయోగ్ సమావేశం ఇంకా ముగియలేదా సీఎం గారూ అంటూ షర్మిల విమర్శలు
గత మూడు వారాలుగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు, కోస్తా ప్రాంతాల్లో వర్షాలు, వరదలు సంభవించి రైతులు ఆర్తనాదాలు పెడుతుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పల్లెలు, పంటలు నీటమునిగి... చూస్తేనే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని పేర్కొన్నారు. 

రైతులు, ప్రజలు అల్లకల్లోలంలో కొట్టుకుని పోతున్నారు... మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు మళ్లీ కోనసీమ ప్రాంతం వరదనీటిలో చిక్కుకుంది... మీ నీతి ఆయోగ్ సమావేశం ఇంకా ముగియలేదా ముఖ్యమంత్రి గారూ? అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏదీ? అని నిలదీశారు. 

"బీహార్ లో వరదలు వస్తే బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సాయం చేసింది. మరి ఏపీకి ఎందుకు ఇవ్వదు? ఏపీ అంటే కేంద్రానికి ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు కూడా బీజేపీకే మద్దతు ఇస్తున్నారు కదా... అలాంటప్పుడు ఢిల్లీలో మీ భాగస్వాముల మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం, మరిన్ని నిధులు, విపత్తు దళాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? 

ఇప్పటికైనా ప్రాథమిక అంచనా, మధ్యంతర అంచనా జరిపించారా, లేదా? నష్ట పరిహారం మీద ఇంతవరకు స్పష్టత లేదు. ఇవన్నీ వదిలేసి పునరావాస కేంద్రాల గురించి మాత్రమే మాట్లాడుతూ, కనీసం ఎప్పుడు పర్యటిస్తారో కూడా చెప్పకపోవడం ప్రజలను కలచివేస్తోంది. 

రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రతి రైతు ఎకరానికి రూ.15,000 ఖర్చు చేశాడు. దీంతోపాటే ఆస్తి నష్టం కూడా జరిగింది. మొత్తం నష్టం అంతా కలిపి సుమారు రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. ఇంత భారీ ఎత్తున పంట నాశనం అయితే ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ నాయకులం మెడ లోతు నీళ్లలో మునిగి రైతన్న కష్టాలు మీకు వివరించాం. మా నిబద్ధతతో మీకు పావు వంతు ఉన్నా మీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించదు. 

వెంటనే వరద పీడిత ప్రాంతాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటించి రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది" అంటూ షర్మిల పేర్కొన్నారు.
YS Sharmila
AP Farmers
Floods
Congress
TDP-JanaSena-BJP Alliance
NDA
Andhra Pradesh

More Telugu News