MS Dhoni: బీసీసీఐ చేతిలో ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యం.. రేపు క్లారిటీ?

MS Dhoni continuity in IPL depends on the retention decision the IPL management and the BCCI

  • రిటెన్షన్ ఆటగాళ్ల సంఖ్యను 5 నుంచి 6కు పెంచాలంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
  • బీసీసీఐ అనుమతిస్తే ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రిటెయిన్ చేసుకునే అవకాశాలు
  • రేపు ముంబై వేదికగా ఫ్రాంచైజీ యాజమాన్యాలతో బీసీసీఐ భేటీ

ఇండియన్ ప్రీమియర్ 2024 ఎడిషన్ ముగిసిపోయి నెలలు కావొస్తున్నా ఎంఎస్ ధోనీ భవితవ్యంపై క్లారిటీ రాలేదు. ఈ ఏడాది సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా వైదొలగిన అతడు వచ్చే సీజన్‌లో ప్లేయర్‌గా కొనసాగుతాడా? తప్పుకుంటాడా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ తీసుకునే నిర్ణయంపైనే ధోనీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి.

ఆటగాళ్ల రిటెన్షన్‌పై బీసీసీఐ తీసుకునే నిర్ణయం కీలకమవనుందని తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్ ఆరంభానికి ముందు మెగా వేలం జరగనుంది. అయితే నిలుపుదల చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను 5 నుంచి 6కు పెంచాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరుతున్నాయి. మరి ఇందుకు బీసీసీఐ అనుమతిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రతి ఫ్రాంచైజీలో ఆరుగురు ఆటగాళ్లను నిలుపుదల (రిటెన్షన్) చేసుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కొనసాగించే అవకాశం ఉంటుందని క్రికెట్ వార్తల వెబ్‌సైట్ ‘క్రిక్ బజ్’ పేర్కొంది.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీశ పతిరన, శివమ్ దూబే ఉన్నారని పేర్కొంది. సీఎస్కే రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితా మారే అవకాశాలు కూడా లేకపోలేదని పేర్కొంది. 

కాగా రేపు (జులై 31) ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేసింది. ఆటగాళ్ల రిటెన్షన్ నిబంధనలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా 5-6 మంది ఆటగాళ్లను నిలుపుదల చేసుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వొచ్చని పలు కథనాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News