Revanth Reddy: కార్పొరేట్ కంపెనీలు రూ.14 లక్షల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టాయి: రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమన్న రేవంత్ రెడ్డి
- తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య
- ఏ రైతూ ఆర్థిక సంక్షోభంలో కూరుకోకూడదనేది తమ విధానమన్న సీఎం
కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే రుణమాఫీ చేశామన్నారు. కార్పొరేట్ కంపెనీలు రూ.14 లక్షల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టాయని, అదే సమయంలో తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకోకూడదనేది తమ విధానం అన్నారు. గతంలో ఎంతోమంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లలో ఈరోజు పండుగ రోజు అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తాము మూడు విడతలుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు.