Kodanda Ramireddy: ఎన్టీఆర్ అలా అనగానే కళ్లవెంట నీళ్ళొచ్చాయ్: కోదండరామిరెడ్డి
- హీరోను కావాలని వచ్చానన్న కోదండ రామిరెడ్డి
- అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలైందని వెల్లడి
- 'సింహబలుడు' షూటింగులో ఎన్టీఆర్ ను చూశానని వివరణ
- ఆయన చాలా గొప్పవ్యక్తి అంటూ తలచుకున్న వైనం
కోదండ రామిరెడ్డి .. ఎంతోమంది హీరోలకు ఎన్నో హిట్స్ ఇచ్చిన సీనియర్ డైరెక్టర్. రాఘవేంద్రరావు - దాసరి నారాయణ రావు తరువాత వినిపించే పేరు ఆయనదే. అలాంటి కోదండరామిరెడ్డి. 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"హీరోను కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన నేను, అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టాను. వి. మధుసూదనరావు దగ్గర .. రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. రాఘవేంద్రరావు గారు రామారావుగారితో 'సింహబలుడు' చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాను. నేను రామారావుగారిని చూడటం అదే మొదటిసారి. ఆయనను చూస్తేనే నాకు భయం వేసేది. అలాంటి ఆయనను డైరెక్ట్ చేసే ఛాన్స్ అంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు" అన్నారు.
" ఒకరోజున రామారావుగారు .. వాణిశ్రీ గారు సెట్ కి వచ్చారు. సీన్ ఏమిటని రామారావుగారు అడిగితే చెప్పాను. అప్పుడు ఆయన 'డైరెక్టర్ గారు ఏరి'? అని అడిగారు. ఆయన వేరే యూనిట్ చేస్తున్నారనీ నేను చెప్పాను. 'మరి ఇక్కడా?' అన్నారాయన. 'నన్ను చేయమన్నారు సార్' అన్నాను నేను. 'ఓకే దట్స్ ఆల్ రైట్ .. కమాన్' అన్నారాయన. నిజానికి 'నువ్వు నన్ను డైరెక్ట్ చేయడమేంటి? అనాలాయన. కానీ 'ఏం చేయాలో చెప్పండి' అని ఆయన అనగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి .. నిజంగా అది ఆయన గొప్పతనం" అని చెప్పారు.