Surya Kumar Yadav: చివరి ఓవర్ వేసి మ్యాచ్‌ను టై చేసిన కెప్టెన్ సూర్య.. వీడియో ఇదిగో
మంగళవారం రాత్రి భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మూడవ టీ20 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసిన విషయం తెలిసిందే. చివరి ఓవర్‌లో శ్రీలంకకు 6 పరుగులు అవసరమైన సమయంలో ఏ స్టార్ బౌలర్ వచ్చి బౌలింగ్ చేస్తాడో అనుకుంటే.. అనూహ్యంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బంతి అందుకున్నాడు. అప్పటివరకు ఒక్క ఓవర్ కూడా వేయని సూర్య బంతిని అందుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే కెప్టెన్ నిజంగా అద్భుతం చేశాడు.
బంతి బంతికి ఏం జరిగిందంటే..
శ్రీలంకకు 6 పరుగులు అవసరమైన చోట 5 పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది.
తొలి బంతి డాట్ అవ్వగా.. రెండవ బంతికి కమిందు మెండిస్ ఔట్ అయ్యాడు. ఇక మూడవ బాల్‌కి మహేశ్ తీక్షణ ఔట్ అయ్యాడు. ఇక నాలుగవ బంతికి 1 పరుగు, 5వ బంతికి 2 పరుగులు, 6వ బాల్ కి 2 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో భారత్ విజయం సాధించింది.
గంభీర్‌పై ప్రశంసల జల్లు
కాగా సూర్య కుమార్ యాదవ్ వేసిన చివరి ఓవర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయోగాత్మకంగా సూర్య, రింకూ సింగ్ బౌలింగ్ చేయడం చూసి ‘గౌతమ్ గంభీర్ శకం’ మొదలైందని భారత క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సూర్య బౌలింగ్ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్‌ను అభినందిస్తున్నారు. జట్టులోని ఆటగాళ్లతో విజయవంతమైన ప్రయోగాలు చేస్తున్నాడని ప్రశంసిస్తున్నారు.