Revanth Reddy: ఈ తమ్ముడిని అలా మోసం చేసింది కాబట్టే... జాగ్రత్త అంటూ కేటీఆర్‌ని హెచ్చరించా: సబితపై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy reveals why he is blaming sabitha indra reddy
  • తనను కాంగ్రెస్‌లోకి సబితక్క ఆహ్వానించిన మాట వాస్తవమేనన్న సీఎం
  • మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని చెప్పి.. బీఆర్ఎస్‌లో చేరారని ఆగ్రహం
  • ఈ తమ్ముడికి అండగా ఉంటానని సబితక్క మోసం చేశారన్న సీఎం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమను నమ్మవద్దని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి చెప్పడంపై సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ... తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా చెప్పారని, అది వాస్తవమేనని.. కానీ మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తే అండగా నిలబడతానని తనకు హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. అందుకే కేటీఆర్‌ను హెచ్చరించానని అభిప్రాయపడ్డారు.

'ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది. ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని నేను చెప్పాను... పెద్ద లీడర్‌వు అవుతావు... పార్టీకి, నీకు భవిష్యత్తు ఉంటుందని నాతో చెప్పానని సబితక్క అంటున్నారు. అది వాస్తవం. అయితే ఇది మా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టింది. కాబట్టి దీనికి కొనసాగింపుగా జరిగిన చర్చను కూడా నేను సభలోనే పెట్టాలి. వారి మాటను విశ్వసించి.. సొంత అక్కగా భావించి... కుటుంబ సంబంధాల నేపథ్యంలో... ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాన'ని చెప్పారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్ నుంచి ఓడిపోయిన తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనను పార్లమెంట్‌కు పోటీ చేయమని చెప్పారని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయమని చెప్పి... అండగా ఉంటానని సబితక్క తనకు మాట ఇచ్చారని, కానీ పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చాక ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆరోపించారు.

'తమ్ముడిగా తనను పిలిచి... మల్కాజ్‌గిరిలో అండగా ఉంటానని ప్రోత్సహించి.. పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించాక కేసీఆర్ మాయమాటలకు... అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకొని తమ్ముడిని మోసం చేసింది కాబట్టే ఈరోజు ఆమెను నమ్మవద్దని కేటీఆర్‌కు చెప్పాను. ఇది నిజమా? కాదా? అని సబితక్కను అడగండి' అని సీఎం ఆవేశంగా అన్నారు. ఆరోజు తనను ప్రోత్సహించి మోసం చేశారని, ఇప్పుడు తమకు నీతులు చెబుతారా? అని మండిపడ్డారు. అయినా తాను కేటీఆర్‌కు చెప్పిన సమయంలో ఎవరి పేరూ తీసుకోలేదన్నారు. అయినా సబితక్క స్పందించడం విడ్డూరమన్నారు.

కొత్త గవర్నర్ గారు వస్తున్నారని... ఆయనను ఆహ్వానించడానికి వెళ్తున్నానని... ఇంకా ఏమైనా ఉంటే ఆ తర్వాత వచ్చి సమాధానం చెబుతానని ముఖ్యమంత్రి అన్నారు. తాను తిరిగి వచ్చాక అందరికి కలిపి సమాధానం చెబుతానన్నారు.
Revanth Reddy
Sabitha Indra Reddy
BRS
Congress

More Telugu News