Kolusu Parthasarathy: జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి: మంత్రి పార్థసారథి
- మంగళగిరిలో మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్
- విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శలు
- జగన్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారని వ్యాఖ్యలు
జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని... వారు ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని... అసెంబ్లీకి రాకుండా అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు.
మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. ప్రజల ఉపాధి పట్ల విజన్ లేని వ్యక్తి వలన రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. నేడు అటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు మీద నమ్మకంతో ఇతర రాష్ట్రాల వారు పెట్టుబడలు పెట్టడానికి చూస్తున్నారని వెల్లడించారు.
అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్న జగన్... ప్రభుత్వంపై అబద్ధపు బురదజల్లుతున్నారని, జగన్ కు దమ్ముంటే రాష్ట్రానికి ఏమి మేలు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. తాము విడుదల చేస్తున్న శ్వేత పత్రాలు తప్పు అని అసెంబ్లీకి వచ్చి నిరూపించాలని స్పష్టం చేశారు.
"వ్యక్తిగత గొడవలు, గంజాయికి అలవాటు పడిన వారు చేసిన మారణకాండపై ఢిల్లీకి వెళ్లి వైసీపీ ధర్నాచేయడం సిగ్గుచేటు. వైసీపీ నేతలు చెప్పేవి వాస్తవాలు అయితే అసెంబ్లీలో చర్చించాలి... దాన్ని వైసీపీ పాంప్లెంట్ పత్రికలో ప్రచురించుకోవాలి. ముఖ్యమంత్రి సవాల్ విసిరితే ఆ సవాల్ ను స్వీకరించలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. పత్రిక, టీవీ ఉందని అబద్ధాలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు.
ఆరోగ్య శ్రీలో కూడా రూ. 1500 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టిందని మాట్లాడుతున్నారు. వైసీపీ దుర్మార్గాలు, దుష్ఫలితాల ప్రభావమే ... రాష్ట్రంలో నేడు ఈ పరిస్థితికి కారణం. వైసీపీ పాలనలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన పేమెంట్ చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తూ ఎన్నో సార్లు ఆయా ఆసుపత్రులు ధర్నాకు దిగాయి. వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా... ఆఖరికి భోజనాలు సప్లై చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి ఉంది.
జగన్ పాలనలో ఎన్నోసార్లు ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగించలేమని ఆసుపత్రులు చెప్పాయి. దీంతో ఎంతో మంది పేదలకు ఆరోగ్యం అందలేదు. అబద్దాలు ప్రచారం చేయడం మాని అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి. రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి అబద్ధాలు ప్రచారం చేస్తే మూల్యం చెల్లించుకుంటారు" అని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.