KTR: ఇది మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమే: కేటీఆర్
- మహిళా శాసనసభ్యులపై అకారణంగా నోరు పారేసుకున్నారని ఆగ్రహం
- అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందన్నారని విమర్శ
- నీలా పార్టీలు మారి మావాళ్లు పదవులు తెచ్చుకోలేదన్న కేటీఆర్
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి చాలా నికృష్టంగా మాట్లాడారన్నారు. ఈ అవమానం కేవలం సబితక్కకు, సునీతక్కకు మాత్రమే జరిగింది కాదని... తెలంగాణ ఆడబిడ్డలందరికీ జరిగిన అవమానమన్నారు.
మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమన్నారు. ఈ ముఖ్యమంత్రి అన్-ఫిట్ ముఖ్యమంత్రి అన్నారు. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. తమ ఇద్దరు మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలన్నారు. ప్రజల దీవెనలు... కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చారన్నారు.
నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కారని ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. ఇప్పటికైనా సీఎం సిగ్గు తెచ్చుకొని... బుద్ధి తెచ్చుకొని బేషరతుగా తమ మహిళా సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకుని వచ్చావని వారిని ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయమన్నారు. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారని భట్టివిక్రమార్కను నిలదీశారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తాము ఏ ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడామంటూ అభ్యంతరం చెబితే, తాము వెంటనే సరిదిద్దుకున్నామన్నారు. అది తమకు కేసీఆర్ నేర్పిన సంస్కారం అన్నారు. అసెంబ్లీలో ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమే అన్నారు. ముఖ్యమంత్రి సిగ్గు, బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకోవాలని హితవు పలికారు. ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.