Gautam Adani: వయనాడ్ విపత్తు బాధితులకు రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన అదానీ
- వయనాడ్ లో విరిగిపడిన కొండచరియలు
- 200కి చేరిన మృతుల సంఖ్య
- ఈ విపత్తు తనను తీవ్రంగా కలచివేసిందన్న గౌతమ్ అదానీ
వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
వయనాడ్ లో సంభవించిన విపత్తు అనేకమంది ప్రాణాలను బలిగొనడం తన హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. ఈ కష్ట సమయంలో అదానీ గ్రూప్ కేరళకు సంఘీభావం ప్రకటిస్తోందని పేర్కొన్నారు. అందుకే కేరళ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు మద్దతుగా రూ.5 కోట్ల విరాళం అందిస్తున్నామని గౌతమ్ అదానీ తెలిపారు.
కాగా, వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 200కి చేరింది. దాదాపు 7 వేల మంది ప్రజలు 50 రిలీఫ్ క్యాంపుల్లో బిక్కుబిక్కుమంటున్నారు.