Parliament Water Leak: కొత్త పార్లమెంటు భవనంలో వాటర్ లీక్.. నీరు పడుతున్న చోట బకెట్.. వీడియో ఇదిగో!
- ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు
- ప్రాణాలు కోల్పోయిన 9 మంది
- పార్లమెంట్ లాబీలో వర్షం నీరు లీక్
- బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్ అంటూ కాంగ్రెస్ విమర్శలు
భారీ వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న సాయంత్రం కురిసిన భారీ వాన 14 ఏళ్లనాటి రికార్డును చెరిపేసింది. వర్షం కారణంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. గంటల తరబడి జనం నీళ్లలోనే చిక్కుకుపోయారు. వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పది విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు.
మరోవైపు వర్షాల కారణంగా కొత్త పార్లమెంటు భవనం లాబీలో నీరు లీక్ అవుతోంది. ఏడాది క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ భవనంలో ఇప్పుడు నీరు లీక్ కావడంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. నీరు లీక్ అవుతున్న చోట బకెట్ పెట్టి ఉన్న వీడియోను కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఎక్స్ ఖతాలో షేర్ చేశారు. ‘బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలో సమస్యలను ఇది బయటపెట్టింది. దీనిపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం ప్రవేశపెడతా’ అని మాణికం ఠాగూర్ రాసుకొచ్చారు.