Jawahar: రిజర్వేషన్ల వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారు: ఏపీ మాజీ మంత్రి జవహర్
- ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న మాజీ మంత్రి జవహర్
- మాదిగల సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని హర్షం
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పలు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఏపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ కూడా దీనిపై స్పందించారు. మాదిగల సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. మంద కృష్ణ నాయకత్వంలో వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందని అభివర్ణించారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారని కొనియాడారు. కానీ, జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకున్నారని జవహర్ విమర్శించారు. జగన్ మాదిగలను కేవలం ఒక ఓటు బ్యాంకు మాదిరిగానే చూశారని మండిపడ్డారు. మాదిగలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందాల్సిన అవసరం ఉందని జవహర్ స్పష్టం చేశారు.
సీనియర్ రాజకీయవేత్త డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా సుప్రీంకోర్టు తీర్పు పట్ల స్పందించారు. 30 ఏళ్ల వర్గీకరణ పోరాటం నేటికి సాకారమైందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రాలు యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.