Vemula Prashanth Reddy: సబితా ఇంద్రారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు... రేవంత్ రెడ్డికి ఉసురు తగులుతుంది: ప్రశాంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డి ప్రవర్తన తాలిబన్లను తలపించేలా ఉందని విమర్శ
- తాము గంటలకొద్ది నిరసన తెలిపినా మాట్లాడే అవకాశమివ్వలేదని ఆగ్రహం
- రేవంత్ అపరిచితుడిలా, అహంకారిలా వ్యవహరిస్తున్నారన్న ప్రశాంత్ రెడ్డి
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన తాలిబన్లను తలపించేలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో సబితా ఇంద్రారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమకు మాట్లాడేందుకు సభలో అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. అవకాశం ఇవ్వాలని స్పీకర్ వద్ద నిరసన తెలిపామన్నారు.
తాము నిరసన తెలిపితే కిరాతకంగా మార్షల్స్‌ను పెట్టి వ్యాన్‌లో ఎత్తిపడేశారని ఆరోపించారు. తమను నేరుగా బీఆర్ఎస్ భవన్‌కు తీసుకువచ్చినట్లు చెప్పారు. తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా, కోవా లక్ష్మిలు సభలోనే ఉండి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమంటే ఇవ్వలేదని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై మాట్లాడేందుకు కూడా అవకాశమివ్వలేదన్నారు. మహిళలను కించపరచడం దారుణమన్నారు.
వెల్‌లో తాము గంటన్నర, మహిళా శాసన సభ్యులు నాలుగున్నర గంటలు నిలబడినా తమకు అవకాశమివ్వలేదన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 హామీలు నెరవేర్చలేక డ్రామాలకు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ సభ్యుల పట్ల కిరాతకంగా, ఫ్యాక్షనిస్ట్‌లా, ఒక అపరిచితుడిలా, ఒక అహంకారిలా... అజ్ఞానంగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మా మహిళా ఎమ్మెల్యేలచే కన్నీళ్లు పెట్టించినందుకు ముఖ్యమంత్రికి త్వరలో తగిన శాస్తి జరుగుతుంది అంటూ శాపనార్థాలు పెట్టారు. తమ మహిళా ఎమ్మెల్యేల ఉసురు ఆయనకు తగులుతుందన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్తానం గురించి మాట్లాడే మొనగాడా... ఈ రేవంత్ రెడ్డి! అని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో, పోరాటంలో కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరన్నారు. కేసీఆర్ తెలంగాణ సాధించిన వ్యక్తి అన్నారు.
2009లో రేవంత్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నందువల్లే గెలిచారన్నారు. ఉద్యమం సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఆయన రోజుకో మాట మాట్లాడుతారన్నారు. ఓసారి సోనియా గాంధీని బలిదేవత అన్న ముఖ్యమంత్రి... ఇప్పుడు ఏమంటున్నారో చూడాలని అన్నారు. చిన్నవయస్సులో సీఎం అయ్యే అవకాశం వచ్చినందున, సద్వినియోగం చేసుకుని బాగా పాలన చేయాలని హితవు పలికారు.