Noman Ziaullah: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుడి హతం
మరో కరుడుగట్టిన పాకిస్థాన్ ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు అంతమొందించాయి. పాకిస్థాన్ ఎస్ఎస్‌జీ కమాండో, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుడైన నోమన్ జియావుల్లాను హతమార్చాయి. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారత భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడు చనిపోయాడు. జులై 27న మచిల్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడేందుకు అతడు ప్రయత్నించగా బలగాలు కాల్చిచంపేశాయి.
బుధవారం అర్థరాత్రి పాకిస్థాన్‌లోని తుగలియాల్‌పూర్ పోస్ట్ నుంచి భారత భూభాగంలోకి జియావుల్లా ప్రవేశించాడని నిఘా ఏజెన్సీలు సమాచారం అందించడంతో బలగాలు అప్రమత్తం అయ్యాయి. మంగుచెక్ ప్రాంతంలోని ఖోర్రా పోస్ట్ సమీపంలో అతడి కార్యకలాపాలను గుర్తించారు. భారత్‌లోకి చొరబడడమే కాకుండా చొరబాట్లను పర్యవేక్షిస్తున్నట్టు జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్ఎఫ్ ఐజీ డీకే బురా ధ్రువీకరించారు. అనంతరం రంగంలోకి దిగి ఎన్‌కౌంటర్‌లో అంతమొందించారు.
భారీ చొరబాటు ప్రణాళికలో భాగంగానే జియావుల్లా భారత్‌లోకి ప్రవేశించాడనే అనుమానంతో బీఎస్ఎఫ్, స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జియావుల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు అప్పగించారు. హఫీజ్ సయీద్‌తో జియావుల్లా ఉన్న నాటి ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌తో అతడి సంబంధాలు బయటపడ్డాయి.