Ismail Haniyeh: రెండు నెలల క్రితమే బాంబు అమర్చి.. పక్కా ప్రణాళికతోనే హమాస్ చీఫ్ హనియే హత్య
- ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో హనియే మృతి చెందినట్టు వార్తలు
- తాజాగా బాంబు దాడిలో చనిపోయినట్టు నిర్ధారణ!
- ‘ది న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనం
- టెహ్రాన్‌లో ఆయన బస చేసిన గెస్ట్‌హౌస్‌లో రెండు నెలల క్రితమే బాంబు అమర్చిన వైనం
- హనియే గెస్ట్‌హౌస్‌లోనే ఉన్నారని నిర్ధారణ చేసుకున్నాక రిమోట్ బాంబు పేల్చివేత
హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే (62) ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో చనిపోలేదా? పక్కా ప్లాన్‌తోనే ఆయనను హత్య చేశారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఆయన మరణించినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అది నిజం కాదని, బాంబు పేలుడులోనే ఆయన మృతి చెందినట్టు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.
పక్కా ప్రణాళికతోనే హనియేను హతమార్చారని, ఇందుకు రెండు నెలల ముందే ప్లాన్ రచించారని సమాచారం. ఆయన ఇంట్లో రెండు నెలల ముందే బాంబులు అమర్చారని, అవకాశం కోసం ఎదురుచూస్తూ ఇప్పుడు పేల్చారంటూ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన కథనం సంచలనమైంది.
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఇటీవల హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్ వెళ్లారు. అక్కడ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రక్షణలో గెస్ట్‌హౌస్‌లో ఉన్నారు. ఆయన టెహ్రాన్ ఎప్పుడు వెళ్లినా తరచూ అక్కడే బస చేస్తారు.
దీనినే అవకాశంగా మార్చుకుని ఆ గెస్ట్‌హౌస్‌లో రెండు నెలల క్రితమే బాంబు అమర్చారు. ఆయన గెస్ట్‌హౌస్‌లోనే ఉన్నారని నిర్ధారణ చేసుకున్న తర్వాత రిమోట్ సాయంతో బాంబును పేల్చేశారు. ఈ ఘటనలో హనియేతోపాటు ఆయన బాడీగార్డ్ కూడా చనిపోయాడు. బాంబు పేలుడు ధాటికి భవనం ఊగిపోయింది. భవనం గోడలు కూలిపోయాయి.