Chandrababu: గతంలో ఎప్పుడూ లేదు... ఒక్కరోజులోనే 97.54 శాతం మందికి పెన్షన్లు అందించాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu tweets about pensions distribution
  • నిన్న ఆగస్టు 1న ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ
  • 64 లక్షల మందికి రూ.2,737 కోట్ల పంపిణీ
  • ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చిందన్న సీఎం చంద్రబాబు
  • ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు కూడా నిన్ననే ఇచ్చామని వెల్లడి
నిన్న (ఆగస్టు 1) ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై ఇవాళ ట్వీట్ చేశారు. 1వ తేదీనే ఇంటి వద్ద రూ.2,737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పెన్షన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా... కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 97.54 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేశామని వెల్లడించారు. 

"వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పెన్షన్ ఆ పేదల జీవితాలకు భరోసానిస్తుంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. 

ప్రభుత్వ ఉద్యోగులు అంటే... ప్రభుత్వంలో భాగం, ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందేశాం. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అనేక సమస్యలు ఉన్నా రూ.5,300 కోట్లు విడుదల చేసి... వారికి దక్కాల్సిన జీతం 1వ తేదీనే చెల్లించాం.

రాష్ట్ర పునర్ నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకం. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు, వారి సంక్షేమం గురించి ఆలోచించి, వారికి తగిన గౌరవం ఇచ్చే ప్రభుత్వం మాది. కలిసి కష్టపడదాం... రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం" అంటూ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
Chandrababu
Pensions
NTR Bharosa
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News