Kunamneni Sambhasiva Rao: ధరణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
- ధరణి ప్రవేశపెట్టిన తర్వాత గ్రామాల్లో అప్రకటిత కల్లోలం నెలకొందన్న ఎమ్మెల్యే
- తెలంగాణలో సర్వే నెంబర్లు సక్రమంగా ఉండవని, అంతా సాదా బైనామాలేనని వెల్లడి
- అమాయకుల భూములను పెద్ద పెద్దవాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని విమర్శ
ధరణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శాసనసభలో విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీలో 'భూమి హక్కులు, సంస్కరణలు' అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధరణి ప్రవేశపెట్టిన తర్వాత గ్రామాల్లో అప్రకటిత కల్లోలం నెలకొందన్నారు. తెలంగాణలో సర్వే నెంబర్లు సక్రమంగా ఉండవని, అంతా సాదా బైనామాలే అన్నారు.
స్పాట్ బుక్ చేస్తే చాలు ఒకేసారి మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణిని అడ్డం పెట్టుకొని అమాయకుల భూములను పెద్దపెద్దవాళ్లు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అందుకే ధరణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ధరణి వల్ల కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు.