Revanth Reddy: దానం నాగేందర్‌కు హైదరాబాద్‌లో ప్రతి గల్లీ తెలుసు... మాట్లాడితే తప్పేంటి?: రేవంత్ రెడ్డి

Revanth Reddy blames brs for stopping Danam in Assembly
  • దానం నాగేందర్‌కు నగరానికి సంబంధించి ప్రతి సమస్యా తెలుసన్న సీఎం
  • ఆయన మాట్లాడుతుంటే పోడియం వద్దకు వెళ్లడం ఏమిటని ప్రశ్న
  • హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ
  • చంద్రబాబు ఆలోచనలను వైఎస్ కొనసాగించారన్న రేవంత్ రెడ్డి
దానం నాగేందర్‌కు హైదరాబాద్‌లో ప్రతి గల్లీ తెలుసునని... ఆయన 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఈ నగరం నుంచి మంత్రిగా పని చేశారని... నగరంలో ప్రతి సందు తెలిసిన వ్యక్తి... ప్రతి సమస్య గురించి తెలిసిన వ్యక్తి అన్నారు. జాతీయస్థాయలో ఈ నగరానికి ఏం కావాలో దానం నాగేందర్‌కు తెలుసు అన్నారు. అలాంటి వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇస్తే తప్పేమిటన్నారు. ఆయన మాట్లాడుతుంటే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయడం ఏమిటన్నారు. ఆయన మాట్లాడుతుంటే పోడియం వద్దకు వెళ్లడమేమిటన్నారు.

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవస్థకు సంబంధించి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... పాలకులు ఎవరున్నా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదన్నారు. 10 ఏళ్ళు పాలించిన వారు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోతే తాము రూ.43 వేల కోట్ల వడ్డీ కట్టామన్నారు. అయినా 10 నెలలు కాకముందే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎస్‌వోటీ, గ్రేహౌండ్స్ తరహాలో తమ హయాంలో హైడ్రాను తెస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో అక్రమాల నివారణకు హైడ్రా తెస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఇంటి నెంబర్లు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు మింగారని, ఇప్పుడు అది కూలిపోయిందన్నారు.

హత్యలపై లెక్కలు తీయించా

రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరం బ్రాండ్‌ను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నగరంలో హత్యలు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని హత్యలపై తాను లెక్కలు తీయించానని... గత డిసెంబర్ నుంచి జులై వరకు 46 హత్యలు జరిగాయన్నారు. కానీ అంతకంటే ముందు ఆరు నెలల కాలంలోనే 48 హత్యలు జరిగాయన్నారు. ఓఆర్ఆర్‌ను తాకట్టు పెట్టిన వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు. 

గతంలో రాత్రి 11 గంటల వరకు విచ్చలవిడిగా గంజాయి దొరికేదని, ఇప్పుడు నగరంలో దానిని అమ్మే దమ్ము ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. పబ్బులు, ఫామ్ హౌస్, డ్రగ్ రాకెట్లలో ఎవరికి సంబంధం ఉందో చర్చించే దమ్ముందా? అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉన్నప్పుడు డ్రగ్ రాకెట్ పై చర్చకు సిద్ధమన్నారు. తమకు అందరి జాతకాలూ తెలుసునన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కొన్ని అంశాలపై చర్చించడం లేదన్నారు. 

చంద్రబాబు ఆలోచనలను వైఎస్ కొనసాగించారు

మంచి ఎక్కడున్నా తాము స్వీకరిస్తామన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ నగరం కోసం సంస్కరణలు చేపడతామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై చంద్రబాబు చేసిన ఆలోచనలను వైఎస్ కొనసాగించారని వెల్లడించారు. వైఎస్ ఓఆర్ఆర్‌ను నిర్మిస్తే దానిని కొంతమంది తాకట్టు పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌ను ప్రణాళికకు విరుద్ధంగా అభివృద్ధి చేశారని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వర్షం వచ్చినా హైదరాబాద్ రోడ్లపై చుక్కనీరు నిలువకుండా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో భూగర్భ నీటి నిల్వలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
Revanth Reddy
Congress
BRS
Danam Nagender

More Telugu News